Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)ను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ మేరకు ప్రకటించారు. ‘చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం’ అని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వాహనాలను నిలిపివేయాలని సూచించారు. కాగా, ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ హెచ్చరికలతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందారు. కేదార్నాథ్ యాత్రలో కీలకమైన మార్గమైన రుద్రప్రయాగ్‌లోని సోన్‌ప్రయాగ్-ముంకటియా రహదారి కొండచరియలు విరిగిపడడం కారణంగా మూసివేశారు. భద్రత దృష్ట్యా సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, ఇతర జిల్లాలతో సహా అనేక జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ఒడ్డున ఉప్పొంగుతుండగా.. నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిపాలన తాజా హెచ్చరిక జారీ చేసింది.
Also Read..
కుట్ర కోణంపైనా దర్యాప్తు ఎయిరిండియా ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి
రథయాత్రలో తొక్కిసలాట.. పూరీలోని గుడించా గుడి వద్ద ఘటన.. ముగ్గురి మృతి
2026 ఏప్రిల్ 1 నుంచి ఇండ్ల నమోదు.. జనగణనపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడి