న్యూఢిల్లీ: జన గణన తొలి దశలో భాగంగా ఇండ్ల నమోదు 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపారు. ఈ మేరకు జన గణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్ల నియామకానికి ముందే వారి మధ్య పని విభజన జరగాలని, రాష్ట్ర, జిల్లాల యంత్రాంగాల సహకారంతో దీన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. జనగణన మొదటి దశలో ఇండ్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటి స్థితిగతులు, ఆస్తులు, సౌకర్యాల వివరాలను నమోదు చేస్తారు. రెండో దశలో జనాభా గణన, పౌరుల సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక తదితర వివరాలను నమోదు చేస్తారు.