హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయలు, రిటైర్డ్ ఉద్యోగుల ( Retired Employees) పై ముఖ్యమంత్రి కర్కశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. ఉద్యోగులకు రావలసిన హక్కులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హరీష్ రావును కలిసి వినతి పత్రం అందచేశారు.
ప్రభుత్వ తీరు వల్ల బెన్ఫిట్లు( Benifits ) , పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని , వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా అంటుందని, అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు. ముఖ్యమంత్రికి మనసు రాక అని పేర్కొన్నారు.
మూసీ బ్యూటిఫికేషన్ కోసం లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం లక్ష కోట్లు, అందాల పోటీల కోసం వందల కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్బాల్ మ్యాచ్కు 100 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్లు, వివిధ రాష్ట్రాల్లో వందల కోట్లతో పత్రిక ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98 వేల కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు 40 వేల కోట్లు చెల్లించారని , కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో సమావేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.