పుణె: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్ర ఏమైనా ఉన్నదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ తెలిపారు. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం బ్లాక్ బాక్స్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధీనంలోనే ఉందన్నారు. విశ్లేషణ కోసం దాన్ని దేశం బయటకు పంపమన్నారు.
ఆదివారం పుణెలో జరిగిన ఓ సదస్సులో ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అనేక ఏజెన్సీలు ఈ ప్రమాదాన్ని విశ్లేషిస్తున్నాయని.. సీసీటీవీ దృశ్యాలను సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్డౌన్ కావడం ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు.