పూరీ: ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుడించా గుడి వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఒక వృద్ధుడు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ముగ్గురు దేవతల విగ్రహాలను రథాల్లో తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఉదయం 4.30 గంటల సమయంలో దర్శనం కోసం భక్తులు భారీగా చేరుకోవడంతో కొందరు కిందపడిపోయి తొక్కిసలాట ప్రారంభమైంది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. జన సమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు చేసిన ఏర్పాట్లు సరిపోలేదని స్థానిక మీడియా పేర్కొంది.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ముగ్గురి మృతదేహాలను శవ పరీక్షకు పంపినట్టు పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ తెలిపారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్, ఎస్పీ స్థానాల్లో కొత్తవారిని నియమించింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. క్షమించరాని నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ అన్నారు. ఈ ఘటనకు తాను బాధ్యత వహిస్తున్నానన్నారు.