న్యూఢిల్లీ, నవంబర్ 23 : విమానం టికెట్‌ను చివరి క్షణంలో రద్దు చేసుకున్నా..80 శాతం రిఫండ్‌ను పొందే రోజులు రాబోతున్నాయి! ఇందుకు సంబంధించిన సరికొత్త టికెట్ జారీ విధానాన్ని కేంద్రం తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ‘ఫ్లైట్ టికెట్ బుకింగ్’లో అంతర్భాగం చేయటం ద్వారా, చివరి క్షణంలో టికెట్ రద్దు చేసుకున్న వాళ్లకు 80 శాతం రిఫండ్ చేయడంపై కేంద్రం యోచిస్తున్నది. దీనిపై పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని, పలు విమానయాన, బీమా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
బలమైన ఆధారాలు ఇస్తే, కొన్ని కేసుల్లో 100 శాతం రిఫండ్‌ను బీమా కంపెనీ నుంచి సదరు ప్రయాణికుడు పొందవచ్చునట. ‘విమాన ప్రయాణంపై అనిశ్చితి.. డబ్బు పోతుందనే భయం.. వాపస్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనటం.. వంటివి చాలామంది విమాన టికెట్లు బుక్ చేసుకోకుండా అడ్డుపడుతున్నాయి’ అని ఓ అధికారి అన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు చెప్పారు.