పాట్నా: బీహార్లోని పలు జిల్లాల్లో బాలింతల చనుబాలలో హానికర రసాయనం యురేనియం ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వారి పాలు తాగే బిడ్డలకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు రావచ్చుననే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ అధ్యయన నివేదికను రాసినవారిలో ఒకరైన ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ, బిడ్డలకు పాలు ఇచ్చే 40 మంది తల్లుల నుంచి పాల నమూనాలను సేకరించి, పరీక్షించామని చెప్పారు. ఈ నమూనాలన్నిటిలోనూ యురేనియం కనిపించిందన్నారు.
70 శాతం మంది శిశువులకు క్యాన్సర్కు దారి తీసే పరిస్థితి లేకపోయినా, ఇతర ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉండవచ్చునని వెల్లడైనట్లు తెలిపారు. మొత్తం మీద యురేనియం స్థాయులు అనుమతించదగిన పరిమితి కన్నా తక్కువగానే ఉన్నాయన్నారు. దీని ప్రభావం తల్లులు, పిల్లలపై కనిష్ట స్థాయిలోనే ఉండవచ్చునని తెలిపారు. అత్యధిక సగటు కాలుష్యం ఖగారియా జిల్లాలోనూ, వ్యక్తిగత స్థాయిలో అత్యధిక కాలుష్యం కటిహార్ జిల్లాలో కనిపించిందని చెప్పారు. యురేనియం వల్ల నరాల అభివృద్ధి దెబ్బతినడం, తెలివితేటలు తగ్గడం వంటి ప్రమాదాలు ఉన్నప్పటికీ, వైద్యులు సూచిస్తే మినహా, చనుబాలు ఇవ్వడం మానకూడదని చెప్పారు. చనుబాలు పిల్లల పోషణకు ప్రయోజనకరమైనవని వివరించారు.