న్యూఢిల్లీ : వచ్చే ఏడాదిలో ఉద్యోగావకాశాలనిచ్చే డిగ్రీల్లో ఎప్పటిలాగానే టెక్నాలజీ కోర్సులే ముందు వరుసలో ఉన్నాయి. ఉపాధిని ఇవ్వడంలో ఎంబీఏ స్థాయి తగ్గింది. కామర్స్, వొకేషనల్ డిగ్రీలు నెమ్మదిగా తమ స్థాయులను పెంచుకున్నాయి. డిజిటల్‌కు పెద్ద పీట వేస్తున్న ఆర్థిక వ్యవస్థలో యాజమాన్యాల ప్రాధాన్యాలు మారుతుండటానికి ఇది సంకేతం. ఈ వివరాలను ఇండియా స్కిల్స్ రిపోర్ట్, 2026 వెల్లడించింది. మన దేశంలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. అయితే, నాన్ టెక్నికల్, వొకేషనల్ డిగ్రీలున్న వారు కూడా క్రమంగా నిలదొక్కుకుంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డాటా వేవ్ ఉద్యోగుల నియామకాలను ప్రోత్సహిస్తున్నాయి. పరిశ్రమలు ఏఐ, అడ్వాన్స్డ్ అనలటిక్స్, క్లౌడ్ టెక్నాలజీస్‌ను అమలు చేస్తున్నందు వల్ల సీఎస్, ఐటీ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఉంది. కేవలం సంప్రదాయ కోడింగ్ చేయడం కాకుండా, ఇంజినీరింగ్ , డాటా ఇంజినీరింగ్‌లో పని చేయగలిగే గ్రాడ్యుయేట్లను కంపెనీలు కోరుకుంటున్నాయి. ఎంబీఏ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందే రేటు 2026లో 72.76 శాతానికి తగ్గింది, ఇది అంతకుముందు సంవత్సరాల్లో దాదాపు 78 శాతం వరకు ఉండేది. కంపెనీలు సాధారణ ఎంబీఏ కన్నా, ఇంజినీరింగ్ ప్లస్ మేనేజ్మెంట్ కాంబినేషన్స్ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఆర్థిక, బీమా, సేల్స్, టెక్నాలజీ, ఆపరేషన్స్ వంటి అనేక రంగాలు వేగంగా విస్తరిస్తుండటంతో కామర్స్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. కామర్స్‌ను ఇక మంచి కెరీర్ మార్గంగా చూడవచ్చు. అదే విధంగా సైన్స్ గ్రాడ్యుయేట్స్ (నాన్ ఐటీ)కి 61 శాతం ఎంప్లాయబిలిటీ ఉంది. యాజమాన్యాలు నైపుణ్యం గల వారిని నియమించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారికి ఉద్యోగావకాశాలు సుదూరంగా ఉంటాయని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు మాత్రం వీరికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమోటివ్, ఆపరేషనల్ రోల్స్‌పై ఆధారపడే పరిశ్రమల్లో వీరికి ఉద్యోగాలు వస్తున్నాయి. సరైన డిగ్రీతోపాటు, సరైన నైపుణ్యాలు తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.
