ఖమ్మం, నవంబర్ 23: ఖమ్మంలో ఈ నెల 29న ‘దీక్షా దివస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన ‘దీక్షా దివస్’ సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం ‘తెలంగాణ తెచ్చుడో – కేసీఆర్ చచ్చుడో’ అంటూ ఉద్యమసారథి కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ‘దీక్షా దివస్’ను ప్రపంచానికి ప్రతిసారి గుర్తుచేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
కాంగ్రెస్ సరార్ అవలంబిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగబడాలని పిలుపునిచ్చారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రేవంత్ ప్రభుత్వం అన్నివిధాలా వైఫల్యం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన పట్ల విసిగి వేసారిన ప్రజల తిరుగుబాటు ఖమ్మం జిల్లా నుంచే మొదలవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు చేసిన మోసాన్ని బీసీలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపుల ఏ మాత్రం భయపడకుండా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా ఖమ్మం సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ దీక్షాదివస్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్థానిక పార్టీ నాయకులే సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడే బాధ్యత కార్యకర్తలదేనని గుర్తుచేశారు. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు మండలాల నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పైస్థాయి నాయకత్వం తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఖమర్, పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, బిచ్చాల తిరుమలరావు, బెల్లం వేణు, పగడాల నరేందర్, తాజుద్దీన్, లకావత్ గిరిబాబు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.