బెంగళూరు, నవంబర్ 23 : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సీఎం కుర్చీలాటకు తెరపడటం లేదు. సీఎం సీటు కోసం డీకే శివకుమార్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, కొత్తగా హోంమంత్రి జీ పరమేశ్వర కూడా రేసులోకి వచ్చారు. సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నానని పరమేశ్వర ఆదివారం వ్యాఖ్యానించారు.
సీఎం పదవి మార్పుపై ఊహాగానాలకు ఇటీవల పార్టీ అధిష్ఠానం ముగింపు పలికినప్పటికీ, డీకే వర్గం ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు పోటీగా పరమేశ్వర రంగంలో దిగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్య మంత్రి పదవి కోసం డీకే ఓ వైపు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే, అసలు అలాంటి చర్చే లేదని హోంమంత్రి కొట్టిపారేశారు.