సిద్దిపేట, నవంబర్ 23: సిద్దిపేట జిల్లాలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. పట్టణాల్లో ఉండే ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతుండడంతో వాటి ఏర్పాటు ఆశయం నీరుగారిపోతున్నది. బస్తీల్లో నివసించే పేదలకు వైద్యసేవలు అందించే దవాఖానల్లో వైద్యులు లేక వైద్యసేవలు అందడం లేదు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 8 బస్తీ దవాఖానలు ఉన్నాయి. ఇందులో గజ్వేల్‌లో 2, హుస్నాబాద్‌లో 1,దుబ్బాకలో 1, సిద్దిపేటలో 4 బస్తీ దవాఖానలు ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, కాళ్లకుంట కాలనీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ మహిళలు, గర్భిణులకు వైద్య సేవలు ఆందించారు. సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా వైద్యం అందించారు. మహిళలకు ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేవారు. మూడు నెలలుగా వైద్యులు లేకపోవడంతో ఈ సేవలన్నీ నిలిచిపోయాయి.
సిద్దిపేట జిల్లాలోని బస్తీ దవాఖానల్లో మూడు నెలల నుంచి మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో సరైన వైద్యసేవలు అందక రోగులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. గజ్వేల్‌లో ఒక బస్తీ దవాఖానలో, దుబ్బాక బస్తీ దవాఖానలో మాత్రమే ఇటీవల పక్మినెంట్ వైద్యులను నియమించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఇన్నాళ్లు పనిచేసిన వైద్యులు డిప్యుటేషన్ రద్దు చేయడంతో తిరిగి వారి పాత పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ బస్తీ దవాఖాన, హుస్నాబాద్ బస్తీ ధవాఖానలో డిప్యుటేషన్‌పై ఇద్దరు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట పట్టణంలోని మూడు బస్తీ దవాఖానలు, గజ్వేల్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీ బస్తీ దవాఖానలో వైద్యులు లేక సేవలు ప్రజలకు అందడం లేదు. దాదాపు 3 నెలల నుంచి వైద్యులు లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. వైద్యులు లేకపోవడంతో రోగులు రావడం తగ్గిపోయారు. అరకొరగా వచ్చిన వారికి నర్సులు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. రక్త పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకుంటున్నప్పటికీ, ఆ రిపోర్టులను చూసే డాక్టర్ లేకపోవడంతో ఎవరికీ సరైన వైద్యం అందడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బస్తీ దవాఖానల్లో వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న వైద్య విద్యార్థులతోనే బస్తీ దవాఖానలు నెట్టుకొస్తున్నారు.
బస్తీ దవాఖానల్లో వైద్యుల నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశాం. కొద్ది రోజుల్లోనే వైద్యుల నియామకం పూర్తిచేసి, బస్తీ దవాఖానల్ల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటిదాకా సిద్దిపేట మెడికల్ కళాశాల ఇంటర్న్‌షిప్ చేస్తున్న మెడికోలతో వైద్యసేవలు అందిస్తున్నాం.
– ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి సిద్దిపేట