హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : యువతరం శిరమెత్తితే.. నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా..’ అన్నట్టు మునుగోడు ఉపఎన్నికల్లో యువతరం స్పందిస్తున్నది. టీఆర్ఎస్ గెలుపు కోసం నడుం కట్టింది. ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ కుట్రలను మునుగోడు యువత బలంగా తిప్పికొడుతున్నది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన యువత మునుగోడు వేదికగా మరోసారి కీలక భూమిక పోషిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తుచేస్తూ ఊరూరా ఉద్యమ జెండాలై యువకిశోరాలు కదులుతున్నారు. చండూరు, మర్రిగూడ, మునుగోడు, చౌటుప్పల్, నాంపల్లి, గట్టుప్పల్, నారాయణపూర్ మండల కేంద్రాలు సహ గ్రామగ్రామాన యువకులు స్వచ్ఛందంగా కదిలొచ్చి టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మోసాలను ఎవరికి వారు..ఎక్కడిక్కడ ఎండగడుతున్నారు.
టీఆర్ఎస్సే ఐడెంటిటీ
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం లేదని తమను వాడుకొని వదిలేస్తారని యూత్ పేర్కొంటున్నది. అదే సమయంలో ఉద్యమకాలం నుంచి పనిచేసిన ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ పార్టీ సముచితస్థానం కల్పిస్తున్నది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ నుంచి మొదలుకుంటే బాల్క సుమన్, గువ్వల బాలరాజు, దూదిమెట్ల బాలరాజుయాదవ్ వంటి కార్పొరేషన్ చైర్మన్లనూ ఉదహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే తమకు భవిత అని మునుగోడు యువకులు స్పష్టం చేస్తున్నారు. మోదీ అధికారంలోకి రాక ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.. కానీ, ఎనిమిదేండ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడని నిలదీస్తున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగాలను ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ‘ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్’ విషయాన్ని యువత గుర్తుచేస్తున్నారు.
ప్రచారంలో ముందుండి నడుస్తున్న యువత
మునుగోడు ఎన్నికల ప్రచారంలో యువత అన్నీ తామై నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహ ఇతర ఇన్చార్జిలను యువకులు ముందుండి నడిపిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 4 గంటల నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో యువకులు తలమునకలవుతున్నారు. ఇల్లిల్లూ తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలో.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, రూ.18వేల కాంట్రాక్ట్ కోసం ఎన్నుకున్న ప్రజలను వంచించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఎందుకు గుణపాఠం చెప్పాలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ భూతం వెళ్లిపోయిందని చెప్పడంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారు.
కేసీఆర్ నాయత్వం.. కేటీఆర్ దత్తత వాగ్దానం
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలిచిన తర్వాత నాలుగేండ్లు మునుగోడు మొహం చూడలేదు. అప్పుడే మోసపోయాం ఇప్పుడా అవకాశం ఇవ్వం. రాజగోపాల్‌రెడ్డిని గెలిపించిన పాపానికి నియోజకవర్గం 40 ఏండ్లు వెనక్కిపోయిందనే అభిప్రాయం మునుగోడు యువతలో స్పష్టం అవుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశమే ఎదురుచూస్తున్నది. అటువంటిది మునుగోడు నియోజకవర్గం దాన్ని ఎలా జారవిడుచుకుంటుందని చౌటుప్పల్ మండలం సుంకలపల్లి గ్రామానికి చెందిన పంతంగి నగేశ్ పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని గెలువనీయమని శపథం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇవ్వడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఈ సారి గట్టిగా తిప్పికొడుతామని చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన బొమ్మరబోయిన రాజు చెప్పారు.
స్వచ్ఛందంగా తిరుగుతున్నం
టీఆర్ఎస్ కోసం స్వచ్ఛందంగా తిరుగుతున్నం. మాకు మేమే కమిటీలు వేసుకొని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటేయాలని చెప్తున్నాం. మా ఊరి బాగుచేసుకోవడానికి సిద్ధపడ్డం. కొత్తమండలం కోసం తిరిగినం. గట్టుప్పల్‌ను మండలం చేసిండ్రు. మా గట్టుప్పల్‌లో మా ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అయినం. అందరం కలిసి టీఆర్ఎస్కు కృతజ్ఞత చెప్పాలని తీర్మానించుకున్నం.
– చెరుకుపల్లి రమేశ్ నేత, గట్టుప్పల్
నా మొదటి ఓటు కారుకే..
నిరుపేద తల్లిదండ్రులు ఆడపిల్లలు పుడితే భారంగా భావిస్తున్నారు. ఆడపిల్లలు భారం కాదని యువకులతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తారని నమ్మి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు మా ఆడబిడ్డల తరఫున కృతజ్ఞతలు. నా మొదటి ఓటును మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకే వేస్తా. టీఆర్ఎస్ గెలుపులో భాగస్వామినవుతా..
– చింతల చైతన్య, సంస్థాన్‌నారాయణపురం
దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
గతంలో ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నది. నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
– రెడ్డిమల్ల కృష్ణ, రావిగూడెం, మునుగోడు
యువతకు పెద్దపీట
టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్నది. భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. స్థానికంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. నైపుణ్యం లేని కార్మికులకూ శిక్షణ ఇచ్చి ఉపాధికి బాటలు వేస్తున్నది. మంత్రి కేటీఆర్ యువతకు అండగా ఉంటున్నరు. గత ప్రభుత్వాలు యువతను రాజకీయంగానే వాడుకొని వదిలేశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నది.
– పాక రాము, డి.నాగారం, చౌటుప్పల్ రూరల్
విదేశాల్లో చదువుల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ ప్రభుత్వం యువ పారిశ్రామిక వేత్తలకు చక్కని అవకాశాలు కల్పిస్తున్నది. వివిధ రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నది. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం ఇస్తున్నది. నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి బాటలు వేస్తున్నది. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.
– పగ్గిళ్ల రాము, మునుగోడు
టీఆర్ఎస్కే ఓటేస్తాం
టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్నది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. పార్టీలో, పరిపాలనలో యువతరానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇతర పార్టీలు యువకులను వాడుకొని వదిలేస్తున్నాయి. దీంతో మునుగోడు యువత టీఆర్ఎస్లో చేరుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.
– బత్తుల విజయ్, దేవత్‌పల్లి గ్రామం, నాంపల్లి మండలం
పరిశ్రమల విస్తరణతో యువతకు ఉద్యోగాలు
దేశం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పరిశ్రమలను స్థాపిస్తున్నారు. టీఎస్ బీపాస్ ద్వారా పరిశ్రమల అనుమతులకు మార్గం సుగమం చేసింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు తెలంగాణకు రావడం వెనుక మంత్రి కేటీఆర్ కృషి ఉన్నది. తెలంగాణ యువతకు కేటీఆర్ రోల్ మోడల్. భవిష్యత్ అంతా యువతదే.. యువత టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడాలి. రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే బీజేపీని తరిమికొట్టాలి. కేసీఆర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
– సురిగి సందీప్ యాదవ్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు, మర్రిగూడ మండలం
ఉన్నత చదువులకు బాటలు
సీఎం కేసీఆర్ ప్రధానంగా విద్యారంగంపై దృష్టి సారించి యువత ఉన్నత చదువులకు బాటలు వేశారు. వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అందుకే, మేము మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే ఓటేస్తాం. అన్ని వర్గాలకు అండగా ఉంటున్న కేసీఆర్ వెంటే నడుస్తాం.
– సోమగోని మహేశ్, ఊకోండి, మునుగోడు మండలం
నా మొదటి ఓటు కారుకే..
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండు. అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ వెంటే మేం నడుస్తాం. నా మొదటి ఓటు కారు గుర్తుకే. మతవిద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి ఓటు వేస్తే బాయిలో వేసినట్టే. అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి ఓటు అడిగి నైతిక హక్కు లేదు.
– భీమనపల్లి శివ, చండూరు
రాజగోపాల్‌రెడ్డికి ప్రజల కంటే పైసల మీదే ప్రేమ ఎక్కువ
రాజగోపాల్‌రెడ్డి తెలివిగా నటిస్తడు. ఆయన లాభం కోసం ఎంతకైనా తెగిస్తడు. ఫక్తు వ్యాపారి. కాంట్రాక్టర్. వ్యాపారికి ప్రజల కంటే పైసల మీదే ప్రేమ ఎక్కువ ఉంటది. రాజగోపాల్‌రెడ్డి చేతిలో మునుగోడు ఒక్కసారి మోసపోయింది. ఇంకోసారి మోసపోయేందుకు రెడీగా లేదు. మోదీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నడు. ఇచ్చిండా..? ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి కూడా అట్లనే ‘నేను గెలిస్తే అది చేస్తా.. ఇది చేస్తా’ అంటున్నడు. రాష్ట్రంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. బీజేపీ మీద గెలిచి రూ.3వేల పింఛన్ ఇస్త అని అంటే ఎవలు నమ్ముతరు.
– కట్టా నాగరాజు, తేరట్పల్లి, చండూరు
డిసైడ్ అయినం టీఆర్ఎస్ వెంటే ఉంటాం
మనుగుడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్నరు. ‘అంతో ఇంతో సాయం చేసిన కేసీఆర్‌కు మీ వంతు చేయకపోతే ఎట్లా బిడ్డా.! అని మా ఊరి పెద్ద మనుషులు అంటున్నరు. మేం కూడా డిసైడ్ అయినం. టీఆర్ఎస్ వెంటే ఉంటం.
– బొమ్మరబోయిన రాజు, కస్తాల, చండూరు మండలం
యువత టీఆర్ఎస్ వైపే
తెలంగాణ రాష్ట్రం వచ్చాక యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందిస్తున్నది. ఇప్పటికే లక్షా ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం గ్రూప్1, 2,4 తోపాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. క్రొన్ని పరీక్షలు కూడాఅయ్యాయి. టీఆర్ఎస్ వెంటే యువత నడుస్తున్నది.
– బోరెం నవీన్‌రెడ్డి, దామెర, నాంపల్లి మండలం
సీఎం కేసీఆర్‌కే యువత మద్దతు
మునుగోడు నియోజకవర్గంలో యువత అంతా టీఆర్ఎస్ వైపే ఉన్నది. ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. గతంలో ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఎంతో మంది బడా పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు పెడుతుండటంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ప్రజలకు అవసరమైన అభివృద్ధి, వినూత్న పథకాలతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంచారు. నేను ఇంటర్ నుంచే నాయకుడిగా పనిచేసి ఇప్పటి వరకు బీజేపీ యువమోర్చా నాయకుడిగా కొనసాగాను. రోజురోజుకూ నవ్వుల పాలవుతున్న బీజేపీలో కొనసాగలేక ఈ రోజే మా సన్నిహితులతో కలిసి టీఆర్ఎస్లో చేరాను.
– పోసిరెడ్డి ఫణీందర్‌రెడ్డి, అంతంపేట, గట్టుప్పల్ మండలం