ఒకనాడు నీటి వనరుల్లేక, భూగర్భ జలాలు అడుగంటి వలస బాట పట్టిన ఉమ్మడి జిల్లా రైతాంగం నేడు ఇదే నేలపై సిరులు పండిస్తున్నది. వరి సాగులో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలుస్తున్నది. పంట పెట్టుబడి మొదలు నిరంతర విద్యుత్ సరఫరా వరకు సీఎం కేసీఆర్ అందిస్తున్న భరోసాను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగుతున్నది. ఈ క్రమంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు భారీగా పెరగ్గా, అందుకు తగ్గట్టు ప్రభుత్వం సరఫరా వ్యవస్థనూ పటిష్టంగా నిర్వహిస్తున్నది. 2014 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగి వరి సాగు 4.50 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుతం 12.72లక్షల ఎకరాలకు చేరింది.
విద్యుత్ కనెక్షన్లు సైతం 4.81లక్షలకు పెరగ్గా.. ఈ నెలలో వినియోగం ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకుతోడు వరి పంటకు కీలక సమయం అవడంతో నిరంతరం బోర్లు, బావుల మోటార్లు పని చేస్తుండడం వల్ల అంతకంతకూ డిమాండ్ ఏర్పడుతున్నది. అయినా ఎప్పటికప్పుడు డిమాండ్‌ను పర్యవేక్షిస్తూ నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు ఏర్పడితే తప్ప నిరంతర కరంటు సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయమూ తెలిసిందే.
– నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ)
2022 ఫిబ్రవరి 13న నల్లగొండ జిల్లాలో 17.05 మిలియన్ యూనిట్లను విద్యుత్‌ను వినియోగించగా, ఈ ఏడాది అదే తేదీన 19.80మిలియన్ యూనిట్ల సరఫరా జరిగింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. జిల్లాలో విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి15 (నమస్తే తెలంగాణ): 2014లో స్వరాష్ట్రం ఏర్పడే నాటికి 3.11 లక్షల వ్యవసాయ కనెక్షన్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడు స్వరాష్ట్రంలో సైతం సాగునీటి వనరులు పెరుగడంతో పాటు భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో అదే స్థాయిలో విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనదక్షతతో 2018 జనవరి 1 నుంచి అందిస్తున్న నిరంతర ఉచిత విద్యుత్తుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికే అత్యధిక మేలు చేకూరుతుంది. ప్రస్తుతం మొత్తం 4.81 లక్షల వ్యవసాయ కనెక్షన్లతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తున్నది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటికేడు పెరుగుతున్నా కరెంటు సరఫరాలో ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా ఇబ్బందులు తలెత్తిన సందర్భాలు లేవు. వారం, పది రోజులుగా సరఫరాలో సాంకేతిక సమస్యలతో చిన్న, చిన్న అంతరాయాలు ఏర్పడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
భారీగా పెరిగిన డిమాండ్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటల సాగు భారీగా పెరుగడంతో అందుకు అనుగుణంగా కరంటు అవసరం కూడా పెరుగుతూ వస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఈ నెల 14న 19.66 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఇక 13న ఆల్‌టైం గ్రేట్‌గా 19.80 మిలియన్ యూనిట్ల సరఫరా జరగడం విశేషం. గతేడాది ఇదే రోజు పరిశీలిస్తే 17.05 మిలియన్ యూనిట్లుగానే నమోదైంది. అంటే దాదాపు 2.75 మిలియన్ యూనిట్ల వాడకం పెరిగినట్లు స్పష్టమవుతున్నది.
రికార్డు స్థాయిలో పెరిగిన సాగు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 యాసంగిలో వరిసాగు 4.50 లక్షల ఎకరాలైతే నేటి యాసంగిలో 12.72లక్షల ఎకరాలకు చేరడం విశేషం. దాదాపు మూడు రేట్ల సాగు విస్తీర్ణం పెరిగింది. సమృద్ధిగా వర్షాలు కురువడంతో పాటు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు మిషన్ కాకతీయ చెరువుల ద్వారా కూడా పెద్ద ఎత్తున భూగర్భజలాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు, బావులు తవ్వి సాగు చేస్తున్నారు. ఎలాగూ కరంటుతో అస్సలు సమస్యనే లేదు. నిరంతర ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు లాంటి పథకాలతో బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. 2018 యాసంగిలో ఉచిత విద్యుత్ ప్రారంభమయ్యే నాటికి నల్లగొండ జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ప్రస్తుత యాసంగిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 5.27లక్షల ఎకరాలకు వరి సాగు చేరుకుంది.
సూర్యాపేట జిల్లాలో 2018 యాసంగిలో 2.19 లక్షల ఎకరాలైతే నేడు 4.63 లక్షల్లో వరి సాగు అవుతున్నది. యాదాద్రి జిల్లాలో 2018 యాసంగిలో 1.06లక్షల ఎకరాలైతే ప్రస్తుత యాసంగిలో 2.80లక్షల ఎకరాల్లో వరి సాగువుతున్నది. సాగర్ ఆయకట్టును మినహా మెజార్టీ భాగం వ్యవసాయం విద్యుత్ ఆధారపడి సాగవుతున్నది. ఇది కాకుండా వేరుశనగ, బత్తాయి, నిమ్మ తోటలకు తోడు మామిడి, దానిమ్మ, డ్రాగన్, వాటర్ ఆపిల్ లాంటి పండ్ల తోటలు, కూరగాయల సాగు సైతం విపరీతంగా పెరిగింది. వీటికి కూడా బోర్లపై ఆధారపడే నీటి సరఫరా సాగుతున్నది. గ్రామాల్లోని సాధారణ రైతులతో పాటు యువకులు, విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విశ్రాంత ఉద్యోగులు సైతం వ్యవసాయంపై ఆసక్తి చూపుతుండడంతో సాగు విస్తీర్ణంతో పాటు విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరుగుతూ వస్తున్నది. అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిరంతరం నాణ్యమైన కరంటు సరఫరా జరుగుతుంది.
డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్
నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగడంతో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది. అయినా వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఒకేసారిగా డిమాండ్ పెరుగడంతో సాంకేతిక కారణాలతో ఒకటి, రెండు గంటలు అంతరాయం ఏర్పడుతుంది. ముందుముందు మరింత డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– చంద్రమోహన్, ఎస్ఈ, నల్లగొండ.