‘సమగ్ర పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా మేమే చెల్లిస్తాం’ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇది. పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా పంటల బీమా పథకం మాత్రం పత్తా లేదు. సీజన్లకు సీజన్లు గడిచిపోతున్నా అడుగు ముందుకు పడలేదు. ఈ యాసంగిలో సాగు నీరు అందక, భూగర్భజలాలు అడుగంటి వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా, సర్కారు నిర్లక్ష్యంతో రైతులు నష్టపరిహారానికి కూడా నోచడం లేదు.
ప్రకృతి వైపరీత్యాలు రైతన్నలతో దోబూచులాడుతుంటాయి. విత్తనం మొదలుకొని పంట చేతికందే వరకు భరోసా ఉండదు. ఆరుగాలం అనేక కష్టనష్టాలకు ఓర్చి రెక్కలుముక్కలు చేసుకునే రైతన్నకు దక్కే ఫలితం అంతంత మాత్రమే. ఇలాంటి సమయాల్లో పంటల బీమా ఎంతగానో దోహదపడుతుంది. భారీ వర్షాలు, వడగండ్లు, కరువు, వరదలు, తెగుళ్లు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని బీమా ఎంతోకొంత కవర్ చేస్తుంది. రైతులకు ఆర్థిక నష్టం నుంచి రక్షణ దొరుకుతుంది. పంటల దిగుబడిలో ఊహించని నష్టాలను పూడుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలివి కాని హామీలు ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేతులెత్తేసింది. అందులో పంటల బీమా పథకం ఒకటి. గత వానకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని గప్పాలు కొట్టినా అమలుకు మాత్రం నోచలేదు. ఇప్పటికే రెండు యాసంగి, రెండు రబీ సీజన్లు గడిచినా పట్టించుకున్న దాఖాలాలు లేవు. పంటల బీమా అమలు చేయడంతోపాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా తమే చెల్లిస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు మాత్రం ఉలుకూపలుకూ లేకుండా మిన్నకుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో యాసంగి సీజన్లో 3.19లక్షల ఎకరాల్లో సాగు అంచనా ఉండగా, రైతులు 2.80లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో అధిక శాతం వరి సాగు చేశారు. అయితే ఓ వైపు నీళ్లు లేక.. మరోవైపు ఎండలతో కండ్ల ముందే వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో పంటను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పడుతున్నారు. ఇంకొందరు పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వినియోగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 20వేలకు పైగా ఎకరాలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. జిల్లాలో సుమారు రెండు లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 5.39లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయగా వాటిలో 50వేల ఎకరాలకు పైగా ఎండిపోయాయి. కాంగ్రెస్ పంటల బీమా అమల్లోకి తెచ్చి ఉంటే ఇయ్యాల రైతులకు ఎంతో భరోసాగా ఉండేది. ఎండిపోయిన పంటలకు బీమా కవర్ అయ్యేది. కానీ ఇప్పుడు పంటలు ఆగమవుతున్నా పరిహారం దక్కని పరిస్థితి నెలకొంది.
గతేడాది లోక్సభ ఎన్నికలు సమయంలో రైతుల నుంచి ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ సర్కారు మరోమారు హంగామా చేసింది. పంటల బీమా అమలు చేస్తామంటూ బీమా కంపెనీలతో చర్చలు జరిపి రైతులను మభ్య పెట్టింది. ఎన్నికలు ముగియగానే ఎప్పటిలాగానే సైలెంట్ అయ్యింది. కనీసం పథకం విధివిధానాలు కూడా రూపొందించ లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే మోసాల పార్టీ. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మోసం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. కేసీఆర్ హయాంలో పంటలకు ఎందుకు ఇబ్బందులు రాలేదు. ఇప్పుడే ఎందుకు కష్టనష్టాలు వస్తున్నాయి? కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతోనే రైతులు అరిగోస తీస్తున్నారు. పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. బీమా అమలు చేసి ఉంటే ఎంతో పరిహారం అందేది. ఇకనైనా పంటల బీమా అమలు చేయాలి.
– పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే