యాదగిరిగుట్ట, జనవరి17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. బుధవారం సాయంత్రం స్వామి వారిని గరుఢ వాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్ర నామార్చన చేపట్టి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం జరిపిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరు కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా నిత్య తిరు కల్యాణ తంతును జరిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులతో సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం వేళ స్వామివారికి దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి వేళ స్వామి వారి తిరువరాధన చేపట్టి, స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్ర నామార్చన జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.