యాదాద్రి : యాదాద్రీశుడి ముఖమండపం స్వర్ణకాంతులమయం కానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. మహద్బుతంగా తీర్చిదిద్దిన స్వర్ణవర్ణపు తొడుగులను ధ్వజస్తంభం పీఠానికి బిగించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తికానున్నట్లు వైటీడీఏ అధికారులు స్పష్టం చేశారు. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక స్వర్ణ తాపడాలను చేయగా ఇందుకు కావాల్సిన రాగి పనులు మహబలిపురానికి చెందిన అనుభవజ్ఞులైన శిల్పి రవీంద్రన్ రూపొందించారు. బంగారు తాపడంపై పుష్పాలు, సింహాం ఆకృతులు, ఉపపీఠాలు వంటి ఆకృతులు వాటిలో లతలు, పుష్పాలు వంటి చూడచక్కని రూపాలను ఆర్ట్ డైరక్టర్ ఆనందసాయి చెక్కారు.
స్వర్ణతాపడం రూపొందించేందుకు 4నెలల సమయం పట్టిందని ఆనందసాయి తెలిపారు. ధ్వజస్తంభంలో యంత్రాలను అమర్చే ప్రాంతంలో బంగారు తొడుగుల బిగింపు తాత్కాలికంగా నిలిపివేశారు. యంత్రాలను అమర్చిన అనంతరం తొడుగులను అమర్చనున్నట్లు ఆయన వివరించారు. దీంతోపాటు ధ్వజస్తంభానికి ముందుభాగంలో ఉన్న బలిపీఠానికి బంగారు వర్ణపు తొడుగుల బిగింపు పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకు 1,552 గ్రాములు బంగారాన్ని వినియోగించనున్నారు. త్వరలో ధ్వజస్తంభం తాపడం పనులు పూర్తయిన వెంటనే బలిపీఠం పనులు చేపట్టనున్నారు.
ఈ నెలలోపు బంగారు తాపడం పనులను పూర్తి చేయనున్నట్లు వైటీడీఏ స్పష్టం చేసింది. ఇప్పటికే స్వామివారి గర్భగుడి ముఖద్వారం తలుపులకు బంగారు తొడుగుల పనులు పూర్తి చేశారు. 14 నారసింహ విగ్రహాలు, 36 కమలం పుష్పాలతో పాటు 36 గంటలను అమర్చారు. ద్వార బంధాన్ని చిలుక ఆకృతిలో రూపొందించారు. 54 చతురస్రాకారంలో గర్భగుడి ముఖద్వారం మహాద్భుతంగా భక్తులను దర్శనం ఇవ్వనుంది.