యాదాద్రి: యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించే మహత్తర యజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం పిలుపు అందుకున్న పలువురు ఆలయ గోపురం కోసం బంగారం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక విశ్రాంత ఉద్యోగి అయిన తిరునగరు యదగిరి కూడా తన వంతు సాయం చేస్తానంటూ ముందుకొచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డికి పదివేల రూపాయల చెక్ అందజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆలయ విమాన గోపురం బంగారు తాపడం కోసం కావాల్సిన బంగారాన్ని విరాళంగా అందించేందుకు భక్తులు విశేష సంఖ్యలో ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే సూర్యపేటకు చెందిన విశ్రాంతి ఉద్యోగి తిరునగరు యాదగిరి తన వంతుగా రెండు గ్రాముల బంగారాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి రెండు గ్రాముల బంగారానికి అయ్యే మొత్తం పదివేల రూపాయలను చెక్ రూపంలో అందజేశారు. అంతకు ముందు కూడా యాదగిరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హరిత నిధికి నిధులు ఇచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.