అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సూపర్ వైజర్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులై, పదేండ్ల సీనియారిటీ, 50 ఏండ్లలోపు వయస్సున్న వారికి అవకాశం ఉండగా, జిల్లాలో 666 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు.
ఆలేరు టౌన్, అక్టోబర్ 11 : నాలుగేండ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దీంతో అర్హులైన అంగన్వాడీలు సూపర్వైజర్లు కానున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా భర్తీ చేయనున్న సూపర్వైజర్ పోస్టులన్నీ ప్రమోషన్ల ద్వారానే చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సూపర్వైజర్ పోస్టుల రాత పరీక్షకు 666 మంది అర్హులు ఉన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. 10వ తరగతి ఉత్తీర్ణులై పదేండ్ల సర్వీస్ పూర్తి చేసుకుని 50 ఏండ్లలోపు ఉన్న ప్రధాన, మినీ అంగన్వాడీ టీచర్లు గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులకు అర్హులు. జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 5, భువనగిరిలో 8, మోత్కూరులో 3, రామన్నపేటలో 7 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా పదోన్నతి ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ అంతా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగనున్నది. దరఖాస్తుల స్వీకరణ, అర్హతల నిర్ధారణ అంతా జిల్లా స్థాయిలో చేపడుతారు. ఇక రాత పరీక్షను రాష్ట్ర స్థాయిలో నిర్వహించి ఫలితాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుపుతారు. జిల్లాలో ఆలేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 167, మోత్కూరు 62, రామన్నపేట 209, భువనగిరి 215 మంది టీచర్లు సూపర్వైజర్ పోస్టుల రాత పరీక్షకు అర్హత సాధించిన వారిలో ఉన్నారు. రాత పరీక్ష కోసం ఈనెల చివరి దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీరితోపాటు ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న మరో 12 మంది, ఒక కో ఆర్డినేటర్ అర్హత సాధించిన వారిలో ఉన్నారు. ప్రతి 25 అంగన్వాడీ కేంద్రాలకు ఒక సూపర్వైజర్ ఉంటారు. ప్రతినెలా వీరు కార్యకర్తల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లోని కిశోరబాలికలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలి. ప్రతినెలా లబ్ధిదారులకు పోషకాహారం సక్రమంగా అందుతుందో, లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది.