నర్సాపూర్, ఫిబ్రవరి9: అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, నర్సాపూర్‌లో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారని, నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎగిరేది టీఆర్ఎస్ జెండానేనని వెల్లడించారు.
బీఆర్ఎస్ రాకముందు నర్సాపూర్‌కు వారం రోజులకి ఒక సారి నీరు వచ్చేదని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవతో మిషన్ భగీరథ ద్వారా ప్రతి రోజు నీరు ఇంటింటికి చేరిందని హరీశ్ రావు అన్నారు. మ్యానిఫెస్టోలో లేకున్న సంక్షేమ పథకాలను అమలుపరిచిన ఘనత కేసీఆర్‌కు చెల్లుతుందని, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని మోసపూరిత ప్రభుత్వం కాంగ్రెస్‌దని ఆయన ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, నర్సాపూర్‌లో పెండింగ్ పనులు పూర్తి అవుతాయని హరీశ్ రావు తెలిపారు.
కాంగ్రెస్ వచ్చాక 24 గంటల కరెంట్‌ను 12 గంటలకు చేశారని, నర్సాపూర్ సబ్ స్టేషన్లో ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డితో కలిసి కొన్ని రోజుల క్రితం లాగ్‌బుక్‌ను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, రైతన్నలను ఇంత మోసం చేసిన కాంగ్రేస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలి? అని ఆయన ప్రశ్నించారు. కులపోడని, గల్లీవాడని, సుట్టమని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే మళ్ళీ అగమైపోతారని ఆయన ఓటర్లను హెచ్చరించారు.
నర్సాపూర్‌లో ఓ టీజేపీ అభ్యర్థి చీరలు, రూ.5 వేలు పంచుతున్నాడట. దేవుడా ఇదంత ఉత్తత్తదే అని మనుసులో తలుచుకొని అన్నం పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని హరీశ్ రావు సూచించారు. బీజేపీ, రేవంత్ రెడ్డి కలిసిపోయారని, బీఆర్ఎస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అని, బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి గొడవలు జరగలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక మెదక్, దౌల్తాబాద్.. ఇలా చాలా చోట్ల మత ఘర్షణలు, జరిగాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా హిందూ, ముస్లీం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చిందని, . బీజేపీ పార్టీకి ఓటేస్తే మోరీలో చేసినట్లేనని ఆయన అన్నారు. బీజేపీ వైఫల్యం వలన భారత దేశంలో పెట్రోల్, డీజీల్, నిత్యవసర వస్తువుల ధరలే కాకుండా బంగారం ధరలు కొండెక్కాయని హరీశ్ మండిపడ్డారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో మిగిలిపోయిన పనులను, కౌన్సిలర్ల హామీలను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డితో కలిసి నెరవేర్చే బాధ్యత తనదని హరీశ్ రావు వెల్లడించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో ఇండోర్ స్టేడియం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, మున్సిపల్ భవనం, దోబీగాట్, రాయారావు చెరువు సుందరీకరణ, కోమటి కుంట సుందరీకరణ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. తదితర వాటికి బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపివేసిందని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాక అధికార పార్టీ వెంటపడి వాటిని పూర్తి చేసే బాధ్యత తనదని ఆయన అన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకగవర్గం చెన్నూర్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని, చెన్నూర్‌లోనే తట్టెడు మట్టి ఎత్తలేని మంత్రి వివేక్ మాటలు నర్సాపూర్ ప్రజలు ఎలా నమ్ముతారని హరీశ్ అన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు చేపించాడట అన్న చందంగా మంత్రి వివేక్ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ పని ఐపోయిందని, అది వాడిపోయిన పుష్పమని, రెక్కలు విరిగిపోవుడే తప్ప వికసించే పుష్పం కాదని.. మెదకే జిల్లాలో బీజేపీ ఒక్క చైర్మన్ గెలవదని హరీవ్ రావు ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీ మొద్దీన్, డీకో-ఆప్షన్ మాజీ సభ్యులు మన్పూర్ రాష్ట్ర నాయకులు శశిధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, గోపి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.