యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. సాయంత్రం వేళ బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్య మనో హరంగా అలంకరించి వెండి జోడు సేవ నిర్వహించారు.
స్వామి వారికి నిత్యారాధన, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. రాత్రి బాలా లయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. కొండపైన ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు భారీగా పాల్గొన్నారు.
నేటి నుంచి స్వామివారి నిత్య కల్యాణం..
పవిత్రోత్సవాలలో భాగంగా రెండురోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.