ఆలేరు రూరల్, నవంబర్ 10 : ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో 1వ వార్డు బస్టాండ్ వెనుక కాలనీలో ప్రజలకు నీటి సరఫరా లేక నెల రోజులు అవుతున్నా పట్టించుకునే నాథుడే లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి విషయాన్ని తెలుపగా వారు చెక్ చేసి పైప్ లైన్ పాడైపోయిందని తెలిపారు. 120 మీటర్ల పైప్ లైన్ దానికి కావాలని, గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవడంతో పైపు వేయలేక పోతున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెల్లడించాడు. దీంతో ఆగ్రహించిన కాలనీ మహిళలు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ.. నెల రోజులుగా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు స్పందించి తమకు నీటి సరఫరా జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వప్న, బాలమణి, సత్తెమ్మ, లచ్చమ్మ, రమ్య, మంజుల, మంగమ్మ, రజిత, అనిత, చెండెమ్మ, విజయలక్ష్మి, రాజిరెడ్డి, చంద్రమౌళి గౌడ్, నరసయ్య, కిష్టయ్య, విశ్వనాథం గౌడ్ పాల్గొన్నారు.