Harish Rao | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటికీ సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించామని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవో సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది పోలీసులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఓటర్లు తెలివైన వారు అని.. తగిన రీతిలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలను ఈసీకి అందజేసి.. ఆయా బూత్‌ల్లో కేంద్ర బలగాలను పెట్టాలని కోరామన్నారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లను నియమించి, లోపలికి వెళ్లే ఓటర్ల ఐడెంటిటీని గుర్తించాలని.. ఆ తర్వాతే వారిని పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని కోరామని తెలిపారు. ఓటర్ ఐడీ గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు పంపించకూడదని సూచించారు.
మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఈసీని కోరామని హరీశ్‌రావు తెలిపారు. చాలావరకు ఫేక్ ఓటర్ ఐడీలను తయారుచేశారని.. దానికి సంబంధించిన వీడియోను ఎన్నికల ప్రధాన అధికారికి సమర్పించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, ఫేఖ్ ఐడీ కార్డుల వివరాలను ఎలక్షన్ అబ్జర్వర్లకు కూడా అందజేశామని పేర్కొన్నారు. తొత్తులుగా మారిన అధికారులపై తప్పకుండా చర్యలు చేపడతామని సీఈవో హామీ ఇచ్చారని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై రివ్యూ పెట్టలేదని.. ఇవాళ వాటిపై రివ్యూ పెట్టడం ఎందుకు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆయన గుర్తుచేశారు. వాళ్లు అధికారంలోకి వచ్చాక ఎన్నోసార్లు కేబినెట్ సమావేశం జరిగిందని.. అసెంబ్లీ జరిగిందని తెలిపారు. కానీ ఈ ఆరు గ్యారంటీలపై ఏనాడూ రివ్యూ చేయలేదని అన్నారు. ఇప్పుడు ఆరు గ్యారంటీలపై రివ్యూ చేయడం జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే అని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి మోకాళ్లపై తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దివాలాకోరు రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా కాంగ్రెస్‌ను ఓడించాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ముందే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు.