రామవరం, నవంబర్ 10 : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ నెల 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. భారతదేశపు మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని 2015లో మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికి, రాష్ట్రంలో ఎక్కడ కూడా మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దీంతో స్పందించిన మైనార్టీ సంక్షేమ శాఖ గతేడాది నుండి ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం అలాగే మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.