హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ)/జడ్చర్లటౌన్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వ పాత ఏరియా దవాఖాన మార్చురీలో పోస్టుమార్టం కోసం వచ్చిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. సీఎం సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ఆదేశాలతో తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ అజయ్‌కుమార్ మంగళవారం జడ్చర్లలోని పాత దవాఖాన మార్చురీని సందర్శించారు.
అక్కడి పరిస్థితులను పరిశీలించి, వైద్య సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు సేకరించారు. ఆ తర్వాత పట్టణ శివారులోని వంద పడకల దవాఖానకు వెళ్లి విచారణ చేపట్టారు. దవాఖాన సూపరింటెండెంట్ చంద్రకళతోపాటు డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ అజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ. జడ్చర్ల మార్చురీ ఘటనకు బాధ్యులైన సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో డాక్టర్ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, మార్చురీ సపోర్టింగ్ స్టాఫ్ (ఎంఎన్‌వో) రవిప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.