జడ్చర్లటౌన్, మార్చి 3 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనకు సర్కార్ బాధ్యత వహించాలని, వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాతోపాటు వైద్యారోగ్య శాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో ఇంతటి ఘోరం జరగడం సిగ్గుచేటని అన్నారు. మంగళవారం ఆయన జడ్చర్ల ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. విచారణ కోసం వచ్చిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓ వ్యక్తి చనిపోతే మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీలో పెడితే కుక్కలు పీక్కుతినడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ దవాఖాన బాగోగులను పట్టించుకోవటంలేదని విమర్శించారు. దవాఖానల్లో మందులు సరిగా లేవని, వైద్య పరికరాలు, వసతులు లేవని చెప్పారు. దవాఖానల్లో వసతులు కల్పించకుండా అధికారులపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవటం సరికాదని అన్నారు.