Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఇక నుంచి వందేమాతరం గేయాలాపనను తప్పనిసరి చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో వందేమాతరం ((Vande Mataram) పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో ‘ఏక్తా యాత్ర’ పేరుతో నిర్వహించిన సామూహిక వందేమాతరం గేయాలాపన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
విద్యాసంస్థల్లో జాతీయ గీతాలాపన చేయడంవల్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దానిపై గౌరవం, దేశభక్తి ఏర్పడుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి నవంబర్ 7తో 150 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. కాగా ఈ గేయాన్ని 1875 నవంబర్ 7న కించంద్ర ఛటర్జి రాశారు.
ఈ గేయం తొలిసారి ఛటర్జి రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురితమైంది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని అన్నారు. ఈ శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.