రామగిరి, నవంబర్ 9: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అరుదైన గౌరవం దక్కింది. ఎంజీయూ నుంచి జారీ చేసే వివిధ కోర్సుల సర్టిఫికెట్లకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్‌లో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో సైతం ఇక్కడ జారీ చేసే సర్టిఫికెట్లను చూసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లను గుర్తించవచ్చు. విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందేలా వర్సిటీ వెబ్సైట్లో డిజీలాకర్/ఎన్ఏడీ పోర్టల్‌ను అందుబాటులో ఉంచి 2022నుంచి 2024 వరకు వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మెమోలు, ఓడీ అప్లోడ్ చేశారు.
అయితే విద్యార్థులు డీజీలాకర్లో తమ వ్యక్తిగత వివరాలతో లాగిన్ అయితే సర్టిఫికెట్ పొందేలా ఏర్పాట్లు చేశారు. మరో వైపు 2024-25 యూజీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసే విద్యార్థులు కచ్చితంగా తమ అపార్ ఐడీని యూనివర్సిటీకి అందించాలని దీంతో వర్సిటీ జారీచేసే మెమోలు, ఓడీపై వాటిని ముద్రించేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ) స్కీమ్, ఎన్ఏడీలో తెలంగాణ రాష్ట్రం నుంచి నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్థానం సంపాదించి, అరుదైన గుర్తింపు దక్కించుకుంది. అధ్యాపకులు, విద్యార్థులకు బయో మెట్రిక్‌తో పాటు పలు అంశాల్లో ముందంజలో ఉన్న ఎంజీయూ మరో అడుగు ముందుకేసింది.
సర్టిఫికెట్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు
కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, రాష్ట్ర, జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ల నుంచి వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ (ఎన్ఏడీ), సెంట్రల్ డిపాజిటరీ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థలకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ సంస్థల్లో రిజిస్ట్రేషన్ అయిన యూనివర్సిటీలు విద్యార్థులకు జారీ చేసే సర్టిఫికెట్లను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అవి యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్లేనా..? నకిలీవా అని తెలుసుకునేందుకు ప్రత్యేక లాగిన్ ద్వారా వివరాలు అందజేస్తాయి.
ఎక్కడ నుంచైనా చూసుకోవచ్చు
ఎంజీయూ పరీక్షల విభాగం జారీ చేసే సర్టిఫికెట్లను ‘డీజీలాకర్/ఎన్ఏడీ’ స్కీమ్‌లో జత చేస్తారు. దీంతో దేశంలో ఎక్కడ ఉన్న విద్యార్థులైనా తమ సర్టిఫికెట్లను నేరుగా పొందడానికి లేదా వాటి జిరాక్స్‌ను తీసుకోవడానికి ఈ స్కీమ్ సహకరిస్తుంది. దీనిలో లాగిన్ అయి ఎన్ఏడీ అడిగిన వివరాలును అందజేస్తే సర్టిఫికెట్స్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధానంతో విద్యార్థులు సర్టిఫికెట్లను స్కాన్ చేసుకోవడం, మెయిల్లో ఉంచుకోవాల్సి అవరసం ఉండదు. ఎన్ఏడీలోకి లాగిన్ అయితే ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లను తీసుకునే అవకాశం ఉంటుంది. వారు జారీ చేసిన సర్టిఫికెట్లపై ప్రత్యేక కోడ్, సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది. దీంతో ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఆ సర్టిఫికెట్లను సంస్థలు సులభంగా గుర్తు పట్టే వీలుంటుంది.
విద్యార్థులు అపార్ ఐడీ అందించాలి
ఎంజీయూతోపాటు అనుబంధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ కళాశాలల్లో 2024-25లో యూజీ, పీజీ, ఎంఈడీ, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎల్ఎల్బీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులంతా విధిగా యూనివర్సిటీకి తమ అపార్ ఐడీ అందచేయాలి. దీంతో ఆ విద్యార్థులకు వర్సిటీ అందచేసే మార్కుల మెమోలు, ఓడీ(ఓరిజినల్ డిగ్రీ)పై ఐడీ ముద్రించి అందచేస్తారు.
డిజీలాకర్/ఎన్ఏడీలో.. సర్టిఫికెట్లు
ఎంజీయూ ఆధ్వర్యంలో యూజీ, ఫీజీ ఇతర వివిధ కోర్సులను 2022 నుంచి 2024 పూర్తి చేసిన విద్యార్థుల మార్కుల మెమోలు, ఓడీలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ డిజీలాకర్/ఎన్ఎడీ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. 2022 కంటే ముందు విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం డిజీలాకర్‌లో పొందు పర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపుఇలా..
యూనివర్సిటీ పరిధిలో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు ఒరిజినలేనా కాదా తెలుసుకోవడానికి ‘డిజీలాకర్/ఎన్ఏడీ’ ఉపయోగపడుతుంది. ఇందుకు ఆయా సంస్థలు కాని, విద్యార్థి కాని ఎన్ఏడీ స్కీమ్ ద్వారా లాగిన్ అయి వారడిగిన వివరాలు, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లయితే వివరాలు అందుబాటులోకి వస్తాయి. సర్టిఫికెట్లపై ఉన్న హాల్ టికెట్ నెంబర్‌కు గాని, విద్యార్థి పేరు, తండ్రి పేరు, కోర్సు నమోదు చేయగానే ఏ సంవత్సరంలో చదివారు, ఎప్పుడు పాసయ్యారు, సర్టిఫికెట్ జారీ అయిన తేదీ తదితర అంశాలు ఓపెన్ అవుతాయి. ఒక వేళ ఆ సర్టిఫికెట్ నకిలీదైతే ఈ వివరాలేవి కనిపించవు.
విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం
యూనివర్సిటీ అందించే సర్టిఫికెట్లును పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ‘డిజీలాకర్/ఎన్ఏడీ’ లాగిన్‌లో అందుబాటులో ఉం చాం. ఎన్ఏడీతో కలసి జారీచేసే సర్టిఫికెట్లు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎక్కడ ఉన్న వారికి కావాల్సిన సర్టిఫికెట్ల కోసం వర్సిటీకీ రావాల్సిన అవసరం లేకుండానే వాటిని పొందే అవకాశం ఉంటుంది. ఇందుకు వర్సిటీ పరీక్షల విభాగం నిబంధనలమేరకు ఫీజు, వివరాలు అందచేస్తే ఆ విద్యార్థి మొబైల్‌కు ప్రత్యేక కోడ్ వెళ్తుంది. దీంతో వారికి కావాల్సిన సర్టిఫికెట్లను డౌన్లోడ్ కానీ, జిరాక్స్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు సరైనావేనా అనే సందేహం వస్తే వారు ఎంజీయూ పరీక్షల విభాగం సంప్రదించి వివరాలు అందచేస్తే ఎన్ఏడీతో నిర్థారణ చేసుకోవచ్చు.
– డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ఎంజీయూ పరీక్షల నియంత్రణాధికారి