మెట్పల్లి, ఫిబ్రవరి 14 : కోరుట్ల, మెట్పల్లి పట్టణాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని కొత్త్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. శనివారం మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం కొంత నిరాశ కలిగించినప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు.
సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం బీఆర్ఎస్కు తగ్గలేదని, కోరుట్లలో 8 సీట్లు, మెట్పల్లిలో 6 సీట్లలో గెలిచామని, పలు వార్డుల్లో స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు ఓడిపోయినట్లు చెప్పారు. ఫలితాలపై విశ్లేషించి ఏమైనా లోపాలుంటే సరిచేసుకుంటామని, కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకతీతంగా సమష్టిగా రెండు పట్టణాల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.
ప్రతి వార్డులో అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల నుంచి సైతం వచ్చి ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలు తమపై ఉంచి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఇంకా ఆలోచన చేయలేదని, క్యాంపులో ఉన్న తమ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంగా ఉండి ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు ఎలాల దశరథరెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, నోముల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.