Largest Magnetic | సమస్త జీవకోటికి ఆధారం, గ్రహాల్లో ప్రధానం సూర్యుడు (Sun). అలాంటి సూర్యుడిని కృత్రిమంగా సృష్టించాలని భావిస్తుంది చైనా. దీనిలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ (Super Conducting Fusion) అయస్కాంతాన్ని రూపొందించింది. విజయవంతంగా పరీక్షించింది. దీనిలో ఉన్న టెక్నాలజీ ప్రపంచంలోని విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
582 టన్నుల అయస్కాంతం
చైనా కృత్రిమ సూర్యుడి ప్రాజెక్టులో భాగంగా 2030 నాటికి ఫ్యూజన్ ద్వారా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద 582 టన్నులు గల అయస్కాంతాన్ని రూపొందించింది. అణు సంలీనం ద్వారా అపరమితమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి ఈ అతిపెద్ద అయస్కాంతం కీలకం. దీన్ని విజయవంతంగా పరీక్షించి కృత్రిమ సూర్యుడిని సృష్టించాలనుకున్న చైనా లక్ష్యానికి ముందడుగు పడినట్లు అయ్యింది. 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ‘D’ ఆకారంతో ఈ అయస్కాంతాన్ని చైనీస్ అకాడమీకి చెందిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది.
కృత్రిమ సూర్యుడు అంటే?
అచ్చం సూర్యుడి లాగే పనిచేసే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను కృత్రిమంగా నిర్మించడం. సూర్యుడిలో 100 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ప్రతి క్షణం కొన్ని కోట్ల హైడ్రోజన్ అణువులు (Hydrogen Atoms) సంలీనం చెంది కార్బన్ డయాక్సైడ్ రహిత అపారమైన శక్తి విడుదలవుతుంది. ఇలాంటి ప్రక్రియనే భూమిపై సృష్టించి విద్యుత్‌గా మారిస్తే స్వచ్ఛమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన శక్తిని పొందవచ్చు.