Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. కొంతకాలంగా కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతున్న రామ్ చరణ్‌కు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని సమాచారం. రామ్ చరణ్‌కు నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ మరియు వారి నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
శస్త్రచికిత్స అనంతరం రామ్ చరణ్ తనకు చికిత్స అందించిన వైద్యులతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ మరికొన్ని రోజులు కోయంబత్తూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శస్త్రచికిత్స సమయంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. చరణ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు ఆయన కోలుకునే వరకు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. మెగా కుటుంబం మొత్తం చరణ్‌కు అండగా నిలవడంతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా “గెట్ వెల్ సూన్ చరణ్” అంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న వెంటనే రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘RC17’ షూటింగ్లో ఆయన పాల్గొననున్నారు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత చరణ్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.