జగిత్యాల, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కకావికలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్‌కుమార్.. తదుపరి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో గత రెండేండ్లుగా జగిత్యాలలో ఎమ్మెల్యే వర్గానికి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి వర్గానికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మేరకు జగిత్యాలలో 36 వార్డుల్లో ఎమ్మెల్యే అనుచరులు పోటీ చేయగా, కేవలం 15 వార్డుల్లో మాత్రమే విజయం సాధించారు. రెండు వార్డుల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన స్వతంత్రులు గెలిచారు. 14 వార్డుల్లో జీవన్‌రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తే 8 వార్డుల్లో విజయం సాధించారు.
జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 10 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే జీవన్‌రెడ్డి వర్గీయులు ఖచ్చితంగా మద్దతు పలుకాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక రాయికల్‌లో మరింత అధ్వానమైన పరిస్థితులు ఎదురయ్యాయి. సంజయ్‌కుమార్ వర్గానికి చెందిన వారు 8 వార్డుల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తే కేవలం ఒక అభ్యర్థి మాత్రమే విజయం సాధించాడు. సంజయ్‌కుమార్ మద్దతుదారులైన మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్పర్సన్ రమాదేవి దాదాపు డిపాజిట్ కోల్పోయారు. జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన వారు మూడు వార్డుల్లో పోటీ చేసి రెండు వార్డుల్లో విజయం సాధించడంతోపాటు, ఒక వార్డులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.
శుక్రవారం వచ్చిన రెండు మున్సిపాలిటీల ఫలితాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు సంజయ్ వర్గం వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై మాజీమంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాల కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ శకునిలా దాపురించాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధిష్టానం జగిత్యాల కాంగ్రెస్‌ను ఎమ్మెల్యే కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలన్నారు. అలాగే, దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన వారికే చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధిష్టానం అలా నిర్ణయం తీసుకోకుంటే తాము ఆలోచన చేస్తామని పేర్కొనడం గమనార్హం.