రాజాపేట, మే 26 : కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలనలో ఇచ్చిన హామీలు నీటి మూటలే అని తేలిపోయాయని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, రాజాపేట మండల జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్రగోకుల జశ్వంత్ అన్నారు. సోమవారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలకు బదులుగా రూ.12 వేలు ఇస్తామని రైతన్నకు వెన్నుపోటు పొడిచి రెండు పంటలకు అవి కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. మాయ మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికి ఇప్పటికి చాలా గ్రామాల్లో రుణమాఫీ కానివారు చాలా మంది ఉన్నట్లు తెలిపారు. అనవసరంగా కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామని ఆ పార్టీ కార్యకర్తలే బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇప్పుడు వస్తలేదని, రెండుసార్లు ఎగనామం పెట్టినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్టు వస్తలేదు, కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ తులం బంగారం ఊసే లేదన్నారు.
ఈ సారి ధాన్యం కొనుగోలులో సగానికి పైగా ధాన్యం దళారుల పాలైందన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేని రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాన్ని అమ్ముకున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్ధితి నెలకొందన్నారు. కేసీఆర్ చెప్పినట్లు ఆశ పడితే గోస పడతాం అనే విషయం నిజమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కూడా మోసపోతే మరో మూడున్నర ఏండ్ల పాటు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మరల నాగరాజు, ఎడ్ల రామచంద్రారెడ్డి, సిద్ధులు లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు.