ఆలేరు టౌన్, మే 15 : యాదగిరిగుట్ట పట్టణంలో దాతల సహకారంతో నిర్మించిన చండీశ్వర భవనం కురుమ కులస్తులదేనని, దాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు, మల్లాపూరం మాజీ సర్పంచ్ కర్రె వెంకటయ్య, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం తెలిపారు. గురువారం ఆలేరు పట్టణంలో కురుమ సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల కాలంలో యేగ్గె మల్లేశం తీరుపట్ల రాష్ట్ర కురుమ కులస్తులు తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలిపారు. కురుమ సంఘాల పేరుతో పదవులు అనుభవించి కులానికి చేసిందేమీ లేదన్నారు. వెంటనే కురుమ సంఘం అధ్యక్ష పదవి, కురుమ ట్రస్ట్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గుట్టలో ఉన్న చండీశ్వర భవనాన్ని తమ సొంత ఖర్చుతో నిర్మించుకున్నామని చెప్పడం సరైంది కాదన్నారు. భవనం వద్దకి కురుమ కులస్తులు రావొద్దని చెప్పడం అవమానంగా ఉందన్నారు. ఇన్ని రోజులుగా చండీశ్వర భవనాన్ని కురుమ కులస్తులు వినియోగించుకున్నామని, ఇప్పుడు ఆ భవనం కేవలం వారి సొంత భవనమని చెప్పుకుంటూ, ఆ భవనాన్ని విక్రయిస్తామని చెప్పడం అత్యంత బాధాకరమన్నారు. చండీశ్వర భవనం ప్రారంభోత్సవ సమయంలో కురుమ కులస్తులమంతా సంఘం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎగ్గే మల్లేషను కురుమ కులస్తులు తరిమికొట్టి రోజు వస్తుందన్నారు.
వెంటనే యెగ్గె మల్లేశ్ స్పందించి సంఘం భవనాన్ని కురుమ కులస్తులకు అప్పగించాలని, లేకపోతే బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో కురుమ కులస్తులకు భవనం లేకుండా చేసిన యెగ్గె మల్లేశ్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కురుమలు తిరగబడాలని పిలుపునిచ్చారు. వారం రోజుల్లో ఆయన నుంచి స్పందన లేకుంటే, ఆయన ఇల్లును ముట్టడించేందుకు సిద్ధంగా ఉండాలని కురుమ కులస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కురుమ, ఆలేరు, యాదగిరిగుట్ట కురుమ సంఘం అధ్యక్షులు కవిడ మహేందర్, పర్వతాలు, కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పేరపు రాములు, కురుమ సంఘం పట్టణ అధ్యక్షుడు ఎగిడి శ్రీశైలం, రాష్ట్ర నాయకులు కాదూరి అ చ్చయ్య, బీర్ల మహేష్, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పత్తి వెంకటేశ్, కొన్న మల్లేశ్, పిక్క శ్రీనివాస్ పాల్గొన్నారు.