చౌటుప్పల్, మే 12 : కామ్రేడ్ రోడ్డ అంజయ్య స్ఫూర్తితో పేదలకు ప్రభుత్వ భూములు దక్కే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జాంగిర్ తెలిపారు. సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో అంజయ్య మూడో వర్ధంతి వేడుకల్లో భాగంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భూమి, ఉపాధి హామీ- పాలకుల వైఖరిపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో భూ పోరాటాలు చేపట్టినట్లు తెలిపారు. అంజయ్య కూడా భూ పోరాటాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. అంతే కాకుండా ఆనాడు భూస్వాముల నుంచి స్థలాలను గుంజి నిరుపేదలకు ఎర్రజెండా నాయకత్వంలో పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుత పాలకులు మళ్లీ ఆ భూములను పరిశ్రమలు, వెంచర్లు, వ్యవసాయ క్షేత్రాల పేరుతో పోగు చేసుకుంటున్నట్లు తెలిపారు. మరోపక్క పంటలు పండి, ప్రజలకు ఉపయోగపడే భూములను పడావు పెడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా సదరు భూములను సాగులోకి తేవాలని, లేకపోతే ఎర్రజెండాలు పాతి పేదలకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ, జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గంగదేవి సైదులు, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బూర్గు కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి పాషా, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరు కిష్టయ్య పాల్గొన్నారు.