భూదాన్ పోచంపల్లి, జనవరి 08 : చేనేత రుణమాఫీ అమలు చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా కార్మికులందరూ సంఘటితంగా ఉద్యమించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద బిజెపి చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలపై కార్మికులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులను మోసగిస్తుందని, వృత్తుల పరిరక్షణ కోసం అన్ని గ్రామాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీ ప్రకటించి 17 నెలలు గడుస్తున్నా నేటికీ రుణమాఫీ చేయకపోవడం విచారకరమన్నారు. ఇంటిల్లిపాది పనిచేస్తేనే చేనేత వస్త్రాలు తయారవుతాయని, బ్యాంకుల అప్పులతో వడ్డీలు కట్టలేక అప్పుల భారంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ప్రకటించి కాలయాపనే తప్పా నేటికీ అమలు నోచుకోలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ, దాసరి మల్లేశం, ఏలే చంద్రశేఖర్, జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్నం శివకుమార్, అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు చింతకింది రమేశ్, ఏలే భిక్షపతి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహేష్, మాజీ సర్పంచ్ నోముల గణేష్, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు మంగళపల్లి శ్రీహరి, ఏలే శ్రీనివాస్, రచ్చ సత్యనారాయణ, వర్కాల వెంకటేశ్వర్లు, తుమ్మ లక్ష్మీనారాయణ, భోగ సురేష్, భోడ దయానంద్, బడుగు శ్రీకాంత్, చేనేత కళాకారులు పాల్గొన్నారు.