బీబీనగర్, ఆగస్టు 15 : గత కొన్ని రోజులుగా బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య వాహనాల రాకపోకలను బంద్ చేశారు. మూసీ వంతెన పక్కకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పిల్లర్లు వేసినా ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో రెండు మండలాల మద్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుద్రవెళ్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలు కాల్వకు అటు వైపు ఉండడంతో నిత్యం మూసీ వంతెనను దాటి వెళ్లేవారు. ప్రస్తుతం కాల్వను బంద్ చేయడంతో పావు కిలోమీటర్ దూరం ఉన్న పొలానికి 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లేందుకు రైతులు అవస్దలు పడుతున్నారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. రోడ్డు ధ్వంస కావడంతో వాహనదారులు సైతం చుట్టూ తిరిగి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు.