– టోకెన్లు ఒకచోట, సరఫరా మరోచోట
– రాజాపేట మండలంలో రైతుల అవస్థలు
రాజాపేట, సెప్టెంబర్ 05 : బస్తా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ బాధలు ఇలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులకు యూరియా కోసం మరో కొత్త కష్టం వచ్చి పడింది. రాజాపేట మండలంలోని రేణికుంట శివారులో ఉన్న పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం డబ్బులు చెల్లించి టోకెన్ తీసుకోవడానికి ఉదయం నుంచే గంటల తరబడి బారులు తీరి అక్కడ టోకెన్ తీసుకుంటున్నారు. కాగా కార్యాలయం వద్ద యూరియా సరఫరా చేయడం లేదు.
రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ గోదాం వద్ద యూరియా సరఫరా చేస్తున్నారు. దాంతో మహిళ రైతులు, మరికొంత మంది రైతులు టోకెన్ తీసుకున్న అనంతరం కాలినడకన అంత దూరం వెళ్లి మళ్లీ రెండోసారి యూరియా కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పనులు మానుకుని గంటల తరబడి నిలబడి ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం ఇన్ని తిప్పలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు జారీ, యూరియా సరఫరా ఒకే చోట చేయాలని మండల రైతుల కోరుతున్నారు.