మోటకొండూర్, అక్టోబర్ 23 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం కుంటుబడిపోతుందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు అన్నారు. ప్రభుత్వాలు గీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే గీతన్నలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు. గీత వృత్తి చేసే ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం (సేఫ్టీ మోకు), ద్విచక్ర వాహనాలు ఇవ్వాలన్నారు. తాటి, ఈత, ఖర్జూర మొక్కలను ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చి నీటి సౌకర్యం కల్పించాలన్నారు.
నందనంలోని నీరా, తాటి, ఈత ఉత్పత్తుల ప్రాజెక్ట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గీత కార్మికుల ఫెన్షన్ రూ.4,000/- పెంచి, సభ్యత్వం కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఎక్స్‌గ్రేసియా రూ.10 లక్షలకు పెంచాలని, గీత సొసైటీలో సభ్యత్వం కలిగి సహజ మరణం పొందిన గీత కార్మికుడికి రూ.5 లక్షల గీతన్న బీమా అమలు చేయాలన్నారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రజ హాస్పిటల్స్ అధినేత విజయ్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు పచ్చిమట్ల మదార్ గౌడ్, తండు పాండురంగయ్య, బీస కృష్ణంరాజు, గాజుల బాలరాజు, కోల కృష్ణ, వంగాల చంద్రమౌళి, సీసా బాలరాజు పాల్గొన్నారు.