నల్లగొండ, సెప్టెంబర్ 17 : రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు సెప్టెంబర్ 17. తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులు, ప్రజలందరికీ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులందరికీ జోహార్లు అన్నారు.
నైజాం పాలనలో కనీస హక్కుల కోసం, దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దాడులు, దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభల ద్వారా మగ్దూం మోహియోద్దీన్, రాజ్ బహదూర్గౌర్, రామానందతీర్ద, మాడపాటి హనుమంత రావు, బూరుగుల రామ కృష్ణా రావు, కొండా వెంకట రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి, దేవలపల్లి రామానుజారావు, కె.ఎల్.మహేంద్ర, డా.మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్ సంస్థాన ప్రజలను చైతన్య పరిచారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాల్లో అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది.
ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భూస్వామ్య, జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచినట్లు తెలిపారు. అంతే కాకుండా వీటన్నింటికి పరాకాష్టగా 1948 ఆగష్టు 27న జరిగిన భైరాన్ పల్లి కాల్పుల సంఘటన మరవరానిదన్నారు. ఆ తర్వాత 21 రోజులలోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరినట్లు చెప్పారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశం భూభాగం మధ్యలో ఉండటం భవిష్యత్ లో సమస్యలకు దారి తీస్తుందని భారత ప్రభుత్వం భావించింది. మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు. తమ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారు.
ఓవైపు సాయుధ పోరాటం..మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్ లో చేరుతానని ప్రకటించారు. నిజాం లొంగుబాటుతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో కలపడం జరిగిందని తెలిపారు. అనంతర కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆంధ్రా పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో తొలి, మలి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసి 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకుంది. తెలంగాణ సాధన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాల్లో రాష్ట్రo ప్రగతి పధంలో శరవేగంగా అభివృది చెంద తూ, దేశానికే తలమానికంగా తయారైందని ఆయన పేర్కొన్నారు.
Nalgonda : రాచరికం నుండి ప్రజా పాలనాకు నాంది : గుత్తా సుఖేందర్ రెడ్డి