భువనగిరి అర్బన్: తల్లిపాల ప్రాధాన్యత, వారోత్సవాలపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖల క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తల్లి పాల సంస్కృతిని కాపాడాల్సిన భాద్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన టీమ్లు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆడపిల్లలపై వివక్షత లేని సమాజాన్ని నిర్మించే దిశలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.
తల్లి పాలు పట్టడానికి పనిచేసే చొట పబ్లిక్ ప్రాంతాలల్లో, బస్టాండ్లలో తదితర ప్రాంతాలలో పరిశుభ్ర వాతావరణంలో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందించాలన్నారు. దవాఖానల్లో సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు జరగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలక పాత్ర వహించాలన్నారు. తల్లిపాలతో తెలివితేటలు వృద్ధి చెందుతాయని, శారీకంగా ఎదుగుతారన్నారు. గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో తల్లి పాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ ఎం.పూర్ణచందర్, స్త్రీ శిశు సంక్షేమ జిల్లా అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.