భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 11 : విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జూలూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకి మధ్యాహ్నం భోజనంలో పెట్టే ఆహార పదార్థాలను పరిశీలించారు. రోజు మెనూ ప్రకారం పెడుతున్నారా, ఆహారం రుచికరంగా ఉంటుందా, సరిపోను పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన 250 మంది విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేస్తామని, ఈ స్కూల్ నుండి కూడా విద్యార్థులు సైకిల్స్ తీసుకుంటారా లేదా అని అడిగారు. అనంతరం జూలూరు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎంత మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలు వస్తున్నారని వివరాలు అడిగారు.
Bhoodan Pochampally : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ హనుమంతరావు
అనంతరం తాసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. మండలంలోని జిబ్లక్ పల్లి గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయి? ఇప్పటివరకు ఎన్ని ఇండ్ల పనులు మొదలయ్యాయి? ఏ దశలో ఉన్నాయ, లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసీల్దార్ నాగేశ్వరరావు, ఎంఈఓ ప్రభాకర్, ఆర్ఐలు గుత్తా వెంకటరెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Bhoodan Pochampally : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్ హనుమంతరావు