– నిబంధనలు ఉల్లంఘిస్తే లారీకి రూ.10 వేలు జరిమానా
బీబీనగర్, డిసెంబర్ 31 : బీబీనగర్ మండలంలోని రాఘవపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గత కొద్ది రోజులుగా సంబంధిత అధికారులకు గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇటీవల అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలు, హిటాచి యంత్రాలను గ్రామస్తులు అడ్డుకుని అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో నూతన పాలకవర్గం గ్రామస్తులతో కలిసి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుమతులు లేకుండా గ్రామంలో ఎలాంటి మట్టి తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇల్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. ఈ తీర్మానాల అమలులో భాగంగా బుధవారం సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, వార్డు సభ్యులు కలిసి తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సీఐ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేసి అక్రమ తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జక్కి నాగేశ్, దొంతి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొరుపునూరి రవి గౌడ్, అజయ్ పాల్గొన్నారు.