చండీగఢ్: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో (IDFC FIRST Bank fraud) రూ.590 కోట్ల మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ బ్యాంకు ఖాతాల్లో ఈ ఫ్రాడ్ జరిగినట్లు ఆ బ్యాంకు గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ మోసం విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు నివేదించింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో హర్యానా ప్రభుత్వంలోని పలు డిపార్ట్మెంట్లకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.
కాగా, తమ బ్యాంకు ఖాతా మూసివేసి ఆ నిధులను మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని హర్యానా ప్రభుత్వానికి చెందిన ఒక డిపార్ట్మెంట్ ఇటీవల ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌ను కోరింది. అయితే ఆ డిపార్ట్మెంట్ పేర్కొన్న మొత్తం, బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్ మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. ఫిబ్రవరి 18 తర్వాత పలు హర్యానా ప్రభుత్వ సంస్థలు కూడా వాటి ఖాతాల్లో చూపుతున్న బ్యాలెన్స్ వ్యత్యాసాలపై ఆందోళన వ్యక్తం చేశాయి.
మరోవైపు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అప్రమత్తమైంది. ఫిబ్రవరి 20న అంతర్గత ఆడిట్ కోసం ప్రత్యేక కమిటీ సమావేశమైంది. పూర్తి బోర్డు మీటింగ్ కూడా నిర్వహించింది. చండీగఢ్ బ్రాంచ్‌లోని హర్యానా ప్రభుత్వ అనుసంధాన ఖాతాల్లో రూ.590 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించింది. అనుమానాస్పద లబ్ధిదారుల ఖాతాలు గుర్తించడంతో పాటు డబ్బు రీకాల్ కోసం ఇతర బ్యాంకులకు అభ్యర్థనలు పంపింది.
కాగా, తమ బ్యాంకులో రూ.590 కోట్ల మోసాన్ని గుర్తించినట్లు ఫిబ్రవరి 22న ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. చండీగఢ్ బ్రాంబ్లోని హర్యానా ప్రభుత్వ బ్యాంకు ఖాతాలకే ఈ మోసం పరిమితమైనట్లు పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత ఎంత మోసం జరిగిందో తేలుతుందని వెల్లడించింది.
మరోవైపు అక్రమాలకు పాల్పడిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. ఈ మోసంలో ఇతర వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ఫ్రాడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్బీఐకి నివేదిక ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కూడా సమాచారం ఇచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు సుమారు 20 శాతం పడిపోయాయి. హర్యానా ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. ఆ బ్యాంకుతో అన్ని లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Also Read:
BJP leader denies blankets | ముస్లిం మహిళల పట్ల బీజేపీ నేత వివక్ష.. దుప్పట్ల పంపిణీ నిరాకరణ
Student gang raped at party | యువతి అత్యాచారం ఆరోపణ.. బ్లాక్మెయిల్ చేస్తున్నదని నిందితుడి ఫిర్యాదు
Watch: డోర్ క్లోజ్ అవుతున్న లిఫ్ట్‌లో ఇద్దరు చిన్నారులు.. ఒక బాలిక ఏం చేసిందంటే?