రామన్నపేట, జూన్ 26 : విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజస్టర్ ను పరిశీలించారు. అనుమతులు తీసుకోకుండా గైర్హాజరైన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. వార్డులను పరిశీలించి శానిటేషన్ బాగులేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పారిశుధ్యంను మెరుగుపరచాలని ఆదేశించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
స్కానింగ్‌కు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని, మంచినీరు బయట కొనుక్కొని రావాల్సి వస్తుందని రోగులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే సమస్యలను పరిష్కదిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సేవా దృక్పథంతో పని చేయాలని, సహజ కాన్పులను పెంచాలని సూచనలు చేశారు. ఆస్పత్రి మరమ్మతులపై సంబంధిత ఇంజినీర్ అధికారులతో నివేదిక తెప్పించుకుని మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ దేవేందర్, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మీ, హెడ్ నర్సు రాణి, సోలి, సువర్ణ ఉన్నారు.