ఆలేరు టౌన్, సెప్టెంబర్ 13 : ఆలేరులో ముంపునకు గురైన రంగనాయక వీధి కుమ్మరివాడలో వరద విపత్తు నివారణకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్మన్ గా ఉన్న తన హయాంలో 2020లో ఇలాగే ఏనుకుంట, బైరంకుంట భారీ వర్షాలకు ఉప్పొంగి రంగనాయక వీధి, కుమ్మరివాడ కాలనీలలో కాల్వలు పొంగిపొర్లడంతో ఈ ప్రాంతం ముంపునకు గురి కావడం జరిగిందన్నారు.
శాశ్వత పరిష్కారం కోసం నాటి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి రూ.కోటి 90 లక్షలు కేటాయించగా వాటిని శాంక్షన్ చేసి టెండర్ కూడా వేసి సోమేశ్వర కాంట్రాక్టర్ కు అప్పగించడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారడం వల్ల ఆ నిధులు ఆపి పనులను చేపట్టకుండా కాలయాపన చేయడంలో అంతర్యం ఏమిటో ఎమ్మెల్యే ఆలేరు ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సోమేశ్వర కాంట్రాక్టర్ లో స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్ విషయంలో లోటు జరిగి ఆపారా అని ఆయన ప్రశ్నించారు.
తీర్మానం చేసి కేటాయించిన నిధులతో నాలుగు మీటర్ల వెడల్పుతో ఆలేరు పెద్ద వాగు వరకు నిర్మాణం చేపట్టాలన్నారు. నిధులు ఉన్నా పనులను ప్రారంభించకుండా ఆపడం వల్లే ఈరోజు రంగనాయక వీధి, కుమ్మరివాడ ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి 40 మంది బాధిత కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసి బాధితులకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు.