బీబీనగర్, జూన్ 16 : తెలంగాణలో వైద్య సేవలు, వైద్య విద్యను మరింత బలోపేతం చేసే దిశగా బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై తొలి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ డా.శైలేంద్ర హండు ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్‌తో కలిసి మంగళవారం నిర్వహించారు. సంస్థలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తూ, వాటిని నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఎన్సీసీ, హైట్స్ సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న ఫేజ్-1 నిర్మాణ పనులు, వాటి పూర్తి గడువులు, హెచ్ఎండిఏ కనెక్టివిటీ, టిఎస్ఆర్టిసి ప్రజా రవాణా సౌకర్యాలు, ఫైర్ సర్వీసెస్ అనుమతుల అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కమిటీ సభ్యులు ప్రస్తావించారు. గుర్తింపు పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే రోగులు, అత్యవసర సేవలకు ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కొండమడుగు గ్రామం వైపు నుండి యాక్సెస్ రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. విశ్రామ్ సదన్ నిర్మాణం, రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, అందుబాటులో ఉన్న మౌలిక వసతుల సమర్థ వినియోగం, డెంటిస్ట్రీ విభాగం బలోపేతం వంటి ప్రతిపాదనలపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ అంశాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీబీనగర్ ఎయిమ్స్ మరింత చేరువ కావాలని, అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువుల్లో పూరై వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో జాతీయ స్థాయి సంస్థగా ఎదగాలని సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ప్రొఫెసర్ డా.తీర్థంకర్ దేబ్, మెడికల్ సూపరింటెండెంట్ డా.మహేశ్వర్‌రెడ్డి లక్కిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) రాజనీష్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శశికుమార్ పాల్గొన్నారు.