రామన్నపేట, జూన్ 28 : రాత్రిపగలు కష్టపడి చదివి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రహిత్యం వల్ల తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులతో పాటు వారి భవిష్యత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల మీద సైతం తీవ్రంగా పడుతుంది. రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన తహసీన్ ఖానమ్ గత మార్చి నెలలో జరిగిన పదో తరగతి పరీక్షలు రాసింది. చురుకుగా ఉండే విద్యార్థి పరీక్ష ఫలితాల్లో 531 మార్కులు రావడంతో తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురైంది.
అన్ని సబ్జెక్టుల్లో మార్కులు నిరాశకు గురిచేసిన హిందీలో 80 మార్కులు రావడంతో హిందీ సబ్జెక్టు జీరాక్స్ పత్రం కావాలని బోర్డుకు దరఖాస్తు చేయడం జరిగింది. దీంతో మూల్యాంకనం తప్పుల తడకగా దిద్దడంతో అధికారులు పరిశీలించి 6 మార్కులను పెంచడం జరిగింది. దీంతో విద్యార్ధికి 531 మార్కులకు గాను 537లు వచ్చినట్లు ప్రకటించారు. విద్యార్ధుల జీవితాలతో చెలగాట మాడుతున్న ఎస్ఎస్సీ బోర్డు అధికారుల తీరుపట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.