రాజాపేట, జనవరి 17 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట శివారులో పులి సంచరిస్తుందన్న సమాచారంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. గ్రామ పరిధిలోని నీల బాలకృష్ణ వ్యవసాయ బావి వైపు పులి సంచరిస్తున్నట్లు, శుక్రవారం పులి అడుగుల ముద్రలు కనిపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని అనుమానాస్పద అడుగుల ముద్రలను పరిశీలించారు.
అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో పులి సంచరిస్తుందన్న వదంతులపై రైతులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని సూచించారు. కనిపించిన అడుగుల ముద్రలు చిరుతపులివని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిపారు. రైతులు ఒంటరిగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వ్యవసాయ పనులకు వెళ్లాలని సూచించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.