సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 19: మునుగోడు అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని (Kusukuntla Prabhakar Reddy) విమర్శించే స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ (Congress) నాయకులకు లేదని, మరోసారి ఆయన గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని బీఆర్ఎస్ (BRS) నాయకులు హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్రి నరసింహ విలేకరులతో మాట్లాడుతూ.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బూట్లు నాకిన నాయకులు అధికార పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి మూటలు మోస్తున్నారని విమర్శించారు. సొంత అన్నకు మంత్రి పదవి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి మునుగోడుకు నిధులు తీసుకురావడం చేతకాక రాజీనామా డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పద వస్తుందని అంటున్న రాజగోపాల్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే బరిలో నిలిస్తే మునుగోడు ప్రజలకు పట్టిన దరిద్రం పోతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి స్థానికుడు కాదు కాబట్టి మునుగోడు ప్రజలపై ప్రేమ లేదన్నారు. ఆయనకు మంత్రి పదవి ఉన్న ధ్యాస మునుగోడు అభివృద్ధిపై లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెన్నుపోటు దారులకు రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి మినహా ఒక్క పని కూడా రాజగోపాల్ రెడ్డి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాత్రి కవిత విద్యాసాగర్, జక్కిడి, ధనవంత్ రెడ్డి, అంతోజు శంకరాచారి, లారీ బిక్షం, తెలంగాణ బిక్షం పాపయ్య, దోటి జంగయ్య, గడ్డం పెంటయ్య, యాదవ రెడ్డి పాండురంగ నాయక్, రాములు సాగర్, నలపరాజు రమేష్, అడపు సురేష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.