రామన్నపేట, నవంబర్ 13 : పాలకుల అసమర్థ విధానాలతో గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వాటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి పరిష్కారం చూపాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా మండలంలో కొమ్మాయిగూడెం, మునిపంపుల, దుబ్బాక, బొగారం గ్రామాల్లో వేర్వేరుగా ఇంటింటి కుటుంబ గ్రామీణ సర్వే నిర్వహించి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అత్యధికంగా వ్యవసాయ ఆధారిత రైతు, కూలీ కుటుంబాలు ఉన్నవని, అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు చివరికి ఎలాంటి లాభం లేక అప్పుల పాలవుతూ అనేక అవస్థలు పడుతున్నారన్నారు.
సాంకేతికత, నూతన యంత్రాలు వాడినా పెట్టుబడి పోను చేతికి చిల్లర కూడా మిగడం లేదని వాపోతున్నారని, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి కనీసం ఇల్లు గడవడం లేదని, చేసే కూలీ పనికి వచ్చిన డబ్బులతో సంసారం గడవక ప్రైవేట్ ఫైనాన్స్ లు తీసుకొస్తే వారు వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక నాణ్యమైన విద్య అందక పోటీ ప్రపంచంలో ప్రైవేట్ బడుల్లో చేర్పిస్తూ ఫీజులు కట్టలేక పోతున్నారని, వచ్చే ఆదాయం పూర్తిగా చదువులకు, దీర్ఘకాలిక రోగాలకు ఖర్చవుతుందన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి నూతనంగా పెన్షన్లు రాక అనేకమంది వేచి చూస్తున్నారని, ప్రభుత్వాలు తాత్కాలిక ఉచిత పథకాలు, ప్రలోభాలకు గురి చేస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం ఎల్లదీస్తున్నాయే తప్పా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం చొరవ చూపడం లేదని విమర్శించారు.
వెంటనే ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి సమస్యలు పరిష్కరించాలన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనంతరం పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, జంపాల అండాలు, కందుల హనుమతు, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, భావండ్లపల్లి బాలరాజు, వేముల సైదులు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటపాక శివకుమార్, శాఖా కార్యదర్శులు తాళ్లపల్లి జితేందర్, శానగొండ వెంకటేశ్వర్లు, గుండాల ప్రసాద్, కూనూరు మల్లేశం, నాయకులు తొలుపులూరి చంద్రశేఖర్, గుండాల నరేశ్, ఎర్ర కాటమయ్య, బూడిద భిక్షం, కుక్కడపు స్వామి, శానాగొండ రామచంద్రం, గట్టు గోపయ్య, గుండాల అనిల్ కుమార్, గాదె రాజకుమార్, అంతటి సత్తయ్య, కూనూరు జంగయ్య, గుణగంటి మల్లేశం, తుర్కపల్లి నరేశ్, బాణాల నవీన్ రెడ్డి, జల్లెల మల్లేశం, సాయి, సందీప్, వీరేశ్ పాల్గొన్నారు.